: 'ధ్యానం' నుంచి ప్రధాని బయటకురావాలి... లలిత్ మోదీ అంశంపై మాట్లాడాలి: కాంగ్రెస్ డిమాండ్
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వివాదంపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇకనైనా ధ్యానం వీడి బయటకు రావాలని, లలిత్ మోదీ అంశంపై మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తెగేసి చెప్పింది. ప్రధానమంత్రి నాయకత్వంపై బీజేపీ అగ్రనేత అద్వానీ చెప్పింది నిజమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ అన్నారు. "నాయకత్వంపై గురి కుదరడం లేదని అద్వానీజీ తెలిపారు. ప్రధాని నాయకత్వంపై నమ్మకం లేదన్నారు. ఇప్పుడు బంతి ప్రధాని కోర్టులోనే ఉంది. ఆయన సమాధానమివ్వాలి" అని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ పునరావృతం అవుతుందని అద్వానీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ... ప్రస్తుత రాజకీయ నాయకత్వంలో బలిమి లేని కారణంగానే దానిపై ఆయన నమ్మకం కోల్పోయారని వడక్కన్ వివరించారు.