: ఇకపై బీజేపీ మనుగడ సాగించడం కష్టమే: నితీష్ కుమార్
ఒక్క ఏడాదిలోనే ప్రజల నమ్మకాన్ని బీజేపీ కోల్పోయిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. ఏడాది పాలన అంటూ గొప్పలు చెప్పుకున్నారని... అదే ఏడాది పాలనలోని కుంభకోణాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఎద్దేవా చేశారు. సుష్మా స్వరాజ్, లలిత్ మోదీ వివాదానికి మానవత్వం పేరిట ముసుగు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఇకపై మనుగడ లేదని జోస్యం చెప్పారు. దేశంలో మరోసారి ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవే అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే శక్తులు ప్రస్తుతం చాలా బలంగా ఉన్నాయన్న అద్వానీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. యోగాను ఎవరికి వారే వ్యక్తిగతంగా ఆచరించాలేగాని... యోగా డే అంటూ పబ్లిసిటీ ఇస్తే వచ్చేది కాదని విమర్శించారు.