: వీధుల్లో మామిడికాయలు అమ్ముతున్న ఎంపీ కుమార్తె!
ఆమె ఝార్ఖండ్ రాజధాని రాంచికి సమీపంలోని ఖుంతి పట్టణంలో ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్. ఆమె తండ్రి ఓ పెద్ద రాజకీయ నాయకుడు. అయినా, సీజన్ లో వీధుల్లో ఆమె మామిడికాయలు అమ్ముకుంటుండగా మీడియా గుర్తించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ... ఏ పని చేసేందుకైనా సిగ్గు పడరాదన్న విషయం తన తండ్రి నేర్పారని గర్వంగా చెప్పారు. ఆమె పేరు చంద్రావతి సరూ. ఆమె తండ్రి పేరు కరియా ముండా.... ఎనిమిదిసార్లు ఎంపీగా నెగ్గారాయన. ఈ బీజేపీ నేత లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గానూ వ్యవహరించారు. అయినా, మన పని మనం చేసుకోవడంలో ఇబ్బంది ఏముంటుందని చంద్రావతి అన్నారు. మామిడికాయలు అమ్మడంలో సమస్యేమీలేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకుంటారన్న దాని గురించి తాను ఆలోచించడం లేదని తెలిపారు. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు వెచ్చిస్తానని ఆమె అంటోంది.