: అంత తక్కువ సమయంలో ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్ నిర్వహించలేం: సీబీఎస్ఈ
పేపర్ లీక్ కారణంగా ఆలిండియా ప్రీ మెడికల్ పరీక్ష (ఏఐపీఎంటీ)ను నాలుగు వారాల్లో మళ్లీ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని సీబీఎస్ఈ తిరస్కరించింది. అంత తక్కువ సమయంలో పరీక్షను నిర్వహించలేమని కోర్టుకు స్పష్టం చేసింది. కొత్తగా పరీక్ష నిర్వహణకు మరికొంత సమయం కావాలని అడిగినట్టు సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ సమయంలో సీబీఎస్ఈ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఆర్.కే.అగర్వాల్, జస్టిస్ ఏ.ఎం.సప్రేల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్వీకరించింది. రేపు దానిపై విచారణ చేపట్టనుంది. ఏఐపీఎంటీలోని ఏడు పరీక్షలను ఏకకాలంలో నిర్వహించడానికి సీబీఎస్ఈకి అదనపుభారం అవుతుందని, కొత్తగా పరీక్ష నిర్వహించాలంటే కనీసం మూడు నెలల సమయం అవసరమవుతుందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. మొదటిసారి మేలో నిర్వహించిన ఈ ప్రీ మెడికల్ పరీక్షా పత్రాలు లీకవడంతో పలువురు కోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టు ఫలితాల విడుదలను రద్దు చేసిన విషయం తెలిసిందే.