: 18 మంది టాప్ మేనేజ్ మెంట్ ఉద్యోగులకు షాకిచ్చిన సన్ ఫార్మా
ఇండియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఉన్న సన్ ఫార్మా 18 మంది ఉన్నతోద్యోగులను విధుల నుంచి తొలగించింది. వీరంతా గతంలో సన్ ఫార్మాలో విలీనమైన ర్యాన్ బ్యాక్సీ (రాన్ బ్యాక్సీని కొనుగోలు చేసిన జపాన్ సంస్థ డైచీ శాంక్యోను 2014లో సన్ ఫార్మా విలీనం చేసుకుంది) ఉద్యోగులే కావడం గమనార్హం. రాన్ బాక్సీ ప్రెసిడెంట్ గా ఉండి ప్రస్తుతం సన్ ఫార్మాలో కీలక పోస్టులో ఉన్న ఇంద్రజిత్ బెనర్జీ, రాన్ బాక్సీ భారత హెడ్ యూగుల్ సిక్రి సహా 18 మందికి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ఉద్వాసన పలికింది. ఉద్యోగుల తొలగింపుపై సన్ ఫార్మా వివరణ ఇస్తూ, 'వారిని కొనసాగించేందుకు, వారి ప్రతిభను పూర్తిగా వినియోగించుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యాం. పూర్తి పారదర్శకంగా, సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేశాము' అని ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని నెలలుగా లాభాలు పెంచుకోలేక ఆపసోపాలు పడుతున్న సంస్థ నెట్ ప్రాఫిట్, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,587 కోట్ల నుంచి రూ. 888 కోట్లకు తగ్గింది. దీంతో కష్టాల నుంచి గట్టెక్కేందుకు సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని గతంలోనే వార్తలు వచ్చాయి.