: అమరావతి భూమిపూజలో దోషంతోనే ఇదంతా, మరిన్ని పూజలు చేయాలని నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన భూమిపూజలో దోషాలు తలెత్తాయా? బొడ్డురాయి స్థాపనలో ఏమైనా లోపాలు జరిగాయా? ముహూర్త బలం అనుకూలంగా లేదా? అందువల్లే టీడీపీకీ, చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయా?... ఇవి ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్యాత్మిక సలహాదారుల్లో ఇప్పుడున్న అనుమానాలు. వీటిని నివృత్తి చేసుకునేందుకు రాజధానికి భూమిపూజ చేసిన పండితులతో చర్చలు జరిపిన అధికారులు, అడ్డంకులు తొలగేందుకు మరిన్ని పూజలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమరావతి నిర్మాణానికి ఈ నెల 6వ తేదీన భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ ముహూర్తం బాగా లేదని అప్పటికే కొందరు పండితులు పెదవి విరిచారు. వాస్తవానికి భూమిపూజకు ముందే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భూమిపూజ అనంతరం కేసులో బాబు ప్రమేయం ఉన్నట్టు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మరిన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. అందువల్లే భూమిపూజపై అనుమానాలు తలెత్తాయి. దీంతో పూజలు జరిపించిన విఖనస భట్టాచార్యులు, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, వాస్తు పండితులు రాఘవయ్య తదితరులు గోప్యంగా కలుసుకుని చర్చించినట్టు తెలుస్తోంది. అడ్డంకులు తొలగించేందుకు రహస్యంగా పూజలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, చిన్నచిన్న అవాంతరాలు వచ్చినా, చంద్రబాబు జాతకం బాగుందని ఈ సందర్భంగా భట్టాచార్యులు చెప్పడం గమనార్హం.