: మిర్పూర్ లో టీమిండియాకు హోటల్ కష్టాలు!

బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న టీమిండియాకు హోటల్ కష్టాలు ఎదురయ్యాయి. గురువారం నుంచి వన్డే సిరీస్ జరగనుండగా, భారత జట్టుకు మిర్పూర్ లోని పాన్ పసిఫిక్ సోనార్ గావ్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు. అయితే, ఆ హోటల్ నగరం మధ్యలో ఉండడం భారత్ జట్టుకు రుచించలేదు. ప్రజలతో క్రిక్కిరిసినట్టుండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, కాలుష్యం ఎక్కువగా ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని జట్టు మేనేజర్ బిశ్వరూప్ దేవ్ తెలిపారు. గుల్షన్ ప్రాంతంలోని హోటల్ లో బస అయితే బాగుంటుందని మొదట్లోనే తాము బంగ్లా క్రికెట్ వర్గాలకు తెలిపామని, అయితే, వారు 'పాన్ పసిఫిక్'లో బస ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక్కడి హోటల్ నుంచి బయటకు అడుగుపెట్టేందుకు ఆటగాళ్లు ఇష్టపడడం లేదని వివరించారు. అయితే, బంగ్లాదేశ్ లో బుధవారం దేశవ్యాప్తంగా బంద్ జరగడంతో భారత్ జట్టును మరో హోటల్ కు తరలించడం కష్టంగా మారింది. భద్రత కారణాల రీత్యా ఇదే హోటల్ లో ఉండకతప్పదని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే హోటల్లో బసచేశారు.