: ఎన్నికల కమిషన్ ను తెలంగాణ ఏసీబీ ఫూల్ చేసింది: జూపూడి ప్రభాకర్


ఓటుకు నోటు కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగించాలంటూ ఎన్నికల కమిషన్ తమకు అనుమతినిచ్చినట్టు తెలంగాణ ఏసీబీ తాజాగా వెల్లడించడంపై టీడీపీ ధ్వజమెత్తింది. వాట్స్ యాప్ లో వచ్చిన ఓ లేఖను ఆధారంగా చేసుకుని టీవీ చానల్స్ లో వార్తలు వస్తున్నాయని, ఇది నిన్నటి తేదీపై ఉన్న లేఖ అని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆ లేఖలో ఉన్న సారాంశాన్ని ఆయన మీడియాకు చదివి వినిపించారు. ఈ లేఖపై తాము ఎలక్షన్ కమిషన్ కు చెందిన ఓ అధికారిని అడిగితే తామెలాంటి లేఖ ఇవ్వలేదని చెప్పారని తెలిపారు. అంటే, ఎన్నికల కమిషన్ ను తెలంగాణ ఏసీబీ ఫూల్ చేసినట్టే అని మండిపడ్డారు. ఈ కేసు గురించి ఈసీకి చెప్పారా? అని తాము గత నెల నుంచి అడుగుతున్నా సమాధానం లేదని, ఇప్పుడు అకస్మాత్తుగా వాట్స్ యాప్ లో ఓ లేఖ ప్రత్యక్షమవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. వంద, రెండొందలు లేదా కొన్ని వేలు లంచం తీసుకునే వారిని పట్టుకోవడమే ఏసీబీ పని అని వ్యాఖ్యానించిన జూపూడి, "మై డియర్ ఖాన్ జీ, క్యా బాత్ కరే తూ" అంటూ ఏసీబీ డీజీని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా వ్యవస్థలున్నాయని... అసలు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఏసీబీ పాత్ర ఎలా ఉంటుందని, జూపూడి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరి తరువాత మరొకరిని టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని, తమ మాట వినని వారిని కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ కేసును ఈసీకి తెలిపారా? లేదా? అని తాము అడుగుతూ వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇలా చేస్తున్నారని చెప్పారు. ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబును దెబ్బ తీసే కుట్రలో భాగంగానే జరుగుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News