: వరుసగా నాలుగో సెషన్లోనూ దూకిన 'బుల్'!
మార్కెట్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు లాభాల బాటలో నడవడంతో వరుసగా నాలుగో సెషన్లోనూ మార్కెట్ 'బుల్' లాభాల దిశగా పరుగులు పెట్టింది. దేశవ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు విస్తరించి వుండడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచిందని నిపుణులు వ్యాఖ్యానించారు. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచి 146 పాయింట్లు పెరిగి 26,833 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 8,092 పాయింట్ల వద్దకు చేరాయి. గత మూడు వారాలుగా నష్టాల్లో సాగిన సూచికల్లో కనిష్ఠ స్థాయిల వద్ద ఈక్విటీల కొనుగోళ్లకు ఎఫ్ఐఐలు ప్రయత్నించడం కూడా లాభాలకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ సెషన్లో సిప్లా, హిందుస్థాన్ యూనీలీవర్, హిందాల్కో, రిలయన్స్, టాటా స్టీల్ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, పవర్ గ్రిడ్, టాటా పవర్, బీహెచ్ఈఎల్, కెయిర్న్ ఇండియా తదితర కంపెనీలు నష్టపోయాయి.