: ఇండియాలో ఫెయిలై, అటకెక్కిన 'ఆండ్రాయిడ్ వన్'!


అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు మరింత వేగంగా, సులువుగా ఇంటర్నెట్ కు అలవాటు పడాలన్న లక్ష్యంతో, గూగుల్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'ఆండ్రాయిడ్ వన్' ప్రాజెక్టు భారత్ లో పలు సమస్యలను ఎదుర్కొంటోంది. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను తయారు చేసి విడుదల చేయడంతో పాటు వాటిల్లో ఇంటర్నెట్ సదుపాయం కోసం గూగుల్ సాంకేతికతను వినియోగించే దిశగా, మైక్రోమ్యాక్స్, కార్బన్, స్పైస్ తదితర సంస్థలు గతంలో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పరిస్థితి మారడంతో ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ల తదుపరి వర్షన్లను తయారు చేయబోవడం లేదని ఈ మూడు సంస్థలూ వెల్లడించాయి. ఇదే సమయంలో, ఆండ్రాయిడ్ వన్ ఫోన్ల తయారీకి నిర్ణయం తీసుకున్న ఇంటెక్స్, లావా, జోలో తదితర సంస్థలు తమ ప్రణాళికలను విరమించుకున్నాయి. ఈ ఫోన్ల తయారీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిందని, ప్రొడక్టు తయారీ మొదలయ్యే సమయానికి మార్కెట్ నుంచి స్పందన రాకపోవడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని ఇంటెక్స్ మొబైల్ ఫోన్ల విభాగం హెడ్ సంజయ్ కాలిరోనా వెల్లడించారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్టు ఇండియాలో అటకెక్కినట్టేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తాము భాగస్వాములతో చర్చిస్తున్నామని, పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో తిరిగి ఆండ్రాయిడ్ వన్ అభివృద్ధిపై దృష్టిని సారిస్తామని గూగుల్ అంటోంది.

  • Loading...

More Telugu News