: భారత్ కు సాయపడండి: అమెరికాను కోరుతున్న జెఠ్మలాని


స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్ కు తీసుకురావడంలో అమెరికా సాయపడాలంటున్నారు ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలాని. వాషింగ్టన్ లో యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన భారత న్యాయవాదుల బృందానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నల్లధనాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు అమెరికా చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచిన వారిపై అమెరికా చేబట్టిన కఠిన చర్యలను కొనియాడారు. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం భారత్ కు కూడా సాయపడాలని జెఠ్మలాని కోరారు. అమెరికా ప్రభుత్వం విదేశాల్లో డబ్బు దాచిన నల్లకుబేరుల జాబితా సంపాదించిందని, ఆ జాబితాలోని పేర్లను భారత్ తోనూ పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నల్లధనాన్ని భారత్ కు తీసుకురావడంలో బీజేపీ సర్కారు విఫలం అయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ క్యాబినెట్ ఏర్పాటు చేసిన నాడే తనలో నిరుత్సాహానికి బీజం పడిందని తెలిపారు. జైట్లీకి ఆర్థిక శాఖ అప్పగించడాన్ని అప్పట్లో తాను తీవ్రంగా నిరసించానని ఈ మాజీ న్యాయ శాఖ మంత్రి వివరించారు. నల్లధనంపై ఉదాసీన వైఖరికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే కారణమని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News