: చాక్లెట్లు తింటే గుండె జబ్బులు దూరం, పక్షవాతం ముప్పు కూడా తగ్గుతుందట: స్కాట్లాండ్ వర్శిటీ అధ్యయనం
చాక్లెట్లు రోజూ తింటుంటే కొవ్వు పెరుగుతుందని, పళ్లు పాడైపోతాయని మాత్రమే మనకు తెలుసు. కానీ, రోజుకు వంద గ్రాముల మిల్క్ చాక్లెట్ లేదా డార్క్ చాక్లెట్ తింటే గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చాక్లెట్ తినేవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం 11 శాతం తక్కువని, గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 25 శాతం తగ్గుతుందని తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం తెలిపింది. చాక్లెట్లకు, గుండె జబ్బులకు ఉన్న సంబంధాన్ని వెలికితీసేందుకు స్కాట్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ అబిర్డీన్ కు చెందిన కొందరు పరిశోధకులు అధ్యయనం చేశారు. దాదాపు 21 వేల మందిని 12 సంవత్సరాల పాటు పరిశీలించి, ఈ ఫలితాలు వెల్లడించారు. రోజుకు వంద గ్రాముల వరకు డార్క్, మిల్క్ చాక్లెట్లు తింటున్న వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గినట్టు గుర్తించారు. చాక్లెట్లు ఆరోగ్యానికి మంచివి కావనే సంప్రదాయ నమ్మకానికి విరుద్ధంగా తమ అధ్యయన ఫలితాలు వచ్చాయని వర్శిటీ పరిశోధకులు తెలియజేశారు.