: సూటూ-బూటుకు 'లూట్'ను కలిపిన రాహుల్
నరేంద్ర మోదీని విమర్శించడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేశారు. నిన్నటివరకూ 'సూటు-బూటు'లు ధరించి విదేశాలు తిరుగుతూ, రైతుల సమస్యలు మరచారని పదే పదే విమర్శించిన ఆయన నేడు మరో పదాన్ని కలిపారు. లలిత్ ట్రావెల్ డాక్యుమెంట్ల గురించి ప్రస్తావిస్తూ, "ఒకవైపు నల్లధనాన్ని అరికడతామని చెబుతూనే, మరోవైపు నల్లధనం దాచుకున్న వారికి మోదీ సర్కారు సహకరిస్తోంది. ఇంతకన్నా బీజేపీ నుంచి మరేం కోరుకోగలం? ఇది సుష్మా స్వరాజ్ వ్యవహారం కాదు. నరేంద్ర మోదీ వ్యవహారమే. దేశాన్ని పాలిస్తున్న నేత, ఇప్పుడు కేవలం లలిత్ మోదీని రక్షించడమే పనిగా పెట్టుకున్నారు. ఇది సూట్-బూట్ సర్కారు. కానీ ప్రజలు నెమ్మదిగా ఈ ప్రభుత్వాన్ని 'సూట్-బూట్, లూట్' సర్కారని తెలుసుకొంటున్నారు" అని అన్నారు. మోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయని విమర్శించారు.