: టీడీపీ నేతలు మూడు మాటలు మాట్లాడుతున్నారు.. వాటిలో ఏది నిజం?:హరీశ్ డిమాండ్


ఓటుకు నోటు కేసుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిది కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ నేతలు మూడు మాటలు మాట్లాడుతున్నారని చెప్పిన హరీశ్ రావు, అందులో ఏది నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, తప్పు చేసిన కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫోన్ సంభాషణల్లోని గొంతుపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన... ఆ గొంతు చంద్రబాబుది కాదని ఓ మంత్రి అంటే, చంద్రబాబు అక్కడక్కడ మాట్లాడిన మాటలను గుదిగుచ్చారని మరో మంత్రి అంటున్నారని, ఇంకో మంత్రి అసలు ఆ గొంతు తమ నేతదే కాదంటున్నారని ఆయన అన్నారు. అసలు ఈ మూడు వాదనల్లో వారి అసలైన వాదన ఏదో తేల్చిచెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఫోన్ ను తాము ట్యాపింగ్ చేయలేదని కూడా హరీశ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెప్పారని ఆయన తెలిపారు. ట్యాపింగ్ పేరిట టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమని కూడా హరీశ్ పునరుద్ఘాటించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకునిపోతుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News