: పట్టాలు తప్పిన రెండు రైళ్లు, లారీని ఢీకొన్న హంపీ ఎక్స్ ప్రెస్
నేడు ఒకేసారి మూడు రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ప్రాణనష్టం అధికంగా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం నుంచి బెంగళూరువైపు వెళుతున్న హంపీ ఎక్స్ ప్రెస్ కాపలా లేని గేటు వద్ద ఆగివున్న లారీని ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నేటి తెల్లవారుఝామున 3.30 గంటల సమీపంలో అనంతపురం జిల్లా దేవరపల్లి సమీపంలో జరిగింది. ఈ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. మరో ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి చెన్నై వెళుతున్న బెంగళూరు-చెన్నై మెయిల్ ఉదయం 5 గంటల ప్రాంతంలో చెన్నై సమీపంలో పట్టాలు తప్పింది. రైలు లోని రెండు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. తక్షణం స్పందించిన ఆర్ పీఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో పలు రైళ్లు రెండు గంటల ఆలస్యంగా నడిచాయి. ఇంకో ఘటనలో ఉదయం 5 గంటల ప్రాంతంలోనే విశాఖ జిల్లా బొర్రా గుహల వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ - కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అరకు వెళ్లే యాత్రికుల కోసం నడిపే పాసింజర్ రైలును అధికారులు రద్దు చేశారు. మధ్యాహ్నానికి రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ వెల్లడించింది.