: మరికాసేపట్లో భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల డీజీపీలు...గవర్నర్ ఆదేశాలే కారణమట!
తెలుగు రాష్ట్రాల డీజీపీల మధ్య మరికాసేపట్లో భేటీ జరిగే అవకాశాలున్నాయి. హైదరాబాదులో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పకుండా రెండు రాష్ట్రాల పోలీసులు చర్చించుకోవాలన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదేశాలతో ఏపీ, తెలంగాణ డీజీపీలు జేవీ రాముడు, అనురాగ్ శర్మలు భేటీ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. ఓటుకు నోటు కేసులో పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో హైదరాబాదులో పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల పోలీసులపై ఉందని గవర్నర్ సూచించారు. అంతేకాక నేతల భద్రతపై నెలకొన్న సమస్యలను ఇరువురూ చర్చించుకుని పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల డీజీపీలు భేటీకి సమ్మతించినట్లు సమాచారం.