: ఓటుకు నోటు కేసులో 20 మందిపై లుకౌట్ నోటీసులు జారీ!
ఓటుకు నోటు కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా చేర్చిన తెలంగాణ ఏసీబీ, వారు దేశం దాటి పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సండ్ర వెంకట వీరయ్యతో పాటు, వేం నరేందర్ రెడ్డి పేర్లు ఇప్పటివరకూ బయటకు రాగా, వీరిని అరెస్టు చేసేందుకు కోర్టు వారెంట్లు కూడా ఏసీబీ చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఇదే కేసులో పాత్రధారులుగా ఉన్న మరో 20 మందికి దశలవారీగా నోటీసులిచ్చి విచారించాలని నిర్ణయించిన ఏసీబీ, వీరు ఇండియా దాటి పోకుండా చూడాలని భావిస్తోంది. వీరిలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెదేపా రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు, శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఒక మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర దేశం నేతలు ఉన్నట్టు పుకార్లు గుప్పుమంటున్నాయి. దీంతో ఏసీబీ నుంచి ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందోనని తెలుగుదేశం నేతలు ఆందోళన చెందుతున్నారు.