: చంద్రబాబును ఎవరూ తాకలేరు: కార్యకర్తలకు ధైర్యం చెప్పిన లోకేశ్
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కార్యకర్తలతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు పంపుతారన్న విషయమై ఆందోళన చెందవద్దని, చంద్రబాబును ఎవరూ తాకలేరని లోకేశ్ వారికి ధైర్యం చెప్పారు. అంతేగాకుండా, "వారు పెట్టిన కేసులు మనల్నేమీ చేయలేవు" అని అన్నారు. చంద్రబాబువి ఢిల్లీ స్థాయి రాజకీయాలైతే, కేసీఆర్ చేసేవి గల్లీ రాజకీయాలని విమర్శించారు. హైదరాబాదులో తాజా పరిణామాల నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తారని మీడియాలో విశేషంగా ప్రచారం జరిగింది. దీంతో, ఆందోళన చెందిన టీడీపీ శ్రేణులు భారీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు చేరుకున్నాయి. ఓ దశలో కార్యకర్తలు తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధపడగా, లోకేశ్ వారిని సముదాయించారు. దీంతో, వారు ట్రస్ట్ భవన్లోనే ఉండిపోయారు.