: ఆఫీసుల్లో ఉద్యోగులపై ఒత్తిడి ఎందుకంటే...!
ఒకటిన్నర సంవత్సరం క్రితం 31 ఏళ్ల నీరజ్ మానేక్ లండన్ లోని ప్రముఖ ఇనిస్టిట్యూట్ నుంచి మేనేజ్ మెంట్ డిగ్రీని పొంది, ముంబైలోని పేరొందిన ప్రైవేటు బ్యాంకు వెల్త్ మేనేజ్ మెంటు డిపార్టుమెంటులో సాలీనా రూ. 15 లక్షల ప్యాకేజీకి ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు దాన్ని వదిలసి ఓ కన్సల్టెన్సీ సంస్థలో కాస్తంత చిన్న ఉద్యోగాన్ని చూసుకున్నాడు. దీనికి కారణం? ఆఫీసుల్లో ఒత్తిడి... 'సైలెంట్ కిల్లర్'గా ఎన్నో జీవితాలను ఇప్పటికే బలితీసుకుంది. ఒకవైపు సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, మరోవైపు క్లయింట్ల మీటింగులు, ఆపై అంతర్గత సమావేశాలు, నివేదికల తయారీ... ఇలా తీవ్రమైన ఒత్తిడి మధ్య పనిదినాల్లో 15 గంటల పాటు విధుల్లో ఉండి, ఆపై సెలవుదినాల్లో సైతం దాని గురించే ఆలోచిస్తూ, మరికొన్ని గంటలు నివేదికలను రూపొందించే పని తనకు వద్దనుకున్నానని మానేక్ చెబుతున్నాడు. మానేక్ లా నిర్ణయాలు తీసుకోలేని ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వాస్తవానికి విధి నిర్వహణలో భాగంగా ఒత్తిడి ప్రతిఒక్కరిపైనా ఉంటుంది. టవర్స్ వాట్సన్ నిర్వహించిన సర్వే ప్రకారం, సగం మంది ఉద్యోగులు తాము ఎంత చేస్తున్నా తమ నుంచి మరేదో కోరుతూ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని అభిప్రాయపడ్డవారే. బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల బాలాజీ లక్ష్మణన్ ది కూడా దాదాపు ఇదే విధమైన కథే. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తున్న బాలాజీ అధికమైన పని ఒత్తిడిని తట్టుకోలేక జాబ్ మానేశాడు. తనకింద పనిచేస్తున్న 20 మందిపై పర్యవేక్షణతో పాటు లక్ష్యాలను చేరుకోవడం, వ్యాపార కాంట్రాక్టులు పెంచుకోవడం, అమ్మకాలు, బడ్జెట్, ఆదాయ లక్ష్యం తదితరాల భారాన్ని మోస్తూ, ఒత్తిడిలో తప్పు చేయడం ఎందుకునే భావనతో ఉద్యోగం వీడాడు. ఉదయం 8 నుంచి రాత్రి 2:30 వరకూ పనిచేసినా కూడా అప్రైజల్ సమయంలో బిలో యావరేజిగానే చూశారని, కుటుంబం ఉన్నది నీకొక్కడికేనా? అని పై అధికారి నుంచి తిట్లు కూడా తిన్నానని బాలాజీ వాపోయాడు. ఆఫీసుల్లో ఒత్తిడి కేవలం పనిభారం వల్లే రాదు. ఉద్యోగిపై ఉండే అంచనాలు, కలసికట్టుగా పనిచేసేందుకు ఇతర ఉద్యోగులు ముందుకు రాకపోవడం, చాలీచాలని వేతనాలు కూడా ఒత్తిడిని పెంచే అంశాలే. అయితే, సమస్యలు వచ్చినప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలని, ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగాన్ని వదులుకునే ముందు పై అధికారులతో విషయం చర్చించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.