: లలిత్ మోదీ వ్యవహారంలో నైతిక బాధ్యతగా రాజీనామాకు సిద్ధపడ్డ సుష్మ!
లలిత్ మోదీ వీసా డాక్యుమెంట్ల జారీకి సహకరిస్తూ, సిఫార్సులు చేసిన వ్యవహారంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తానని చెప్పగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో విమర్శలు తలెత్తకముందే ఆమె రిజైన్ చేసేందుకు సిద్ధపడగా, కొనసాగాల్సిందేనని ఆర్ఎస్ఎస్ పట్టుబట్టినట్టు పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. గత వారంలో బ్రిటన్ ఎంపీ లేఖలను ఓ చానల్ బయటపెట్టగానే, ఆమె ప్రధాని మోదీని కలిసి తాను పదవి నుంచి తప్పుకుంటానని వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ వెంటనే సుష్మ విషయమై భవిష్యత్ కార్యాచరణ కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు సమావేశం కాగా, మరోసారి విషయాన్ని వివరించిన సుష్మ, తానేమీ తప్పు చేయలేదని, అయినా, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా ఉండేందుకు తాను రాజీనామా చేస్తానని అన్నారట. సుష్మాకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్న రెండు పార్టీల నేతలు, ఆమె రిజైన్ అవసరం లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది.