: 73 లీటర్ల ఇంధనంతో 14 దేశాలు తిరిగిన 'ఆడీ' కారు... ఆటో ఇండస్ట్రీలో అద్భుత గిన్నిస్ రికార్డు
హైఎండ్ మోడల్ కార్లు తక్కువ మైలేజీని ఇస్తాయన్న భావనను చెరిపేస్తూ, ఫుల్ ట్యాంకు ఇంధనంతో ఆడీ ఏ6 టీడీఐ ఆల్ట్రా మోడల్ కారు 14 దేశాలు చుట్టి వాహన పరిశ్రమలో సరికొత్త గిన్నిస్ రికార్డును నమోదు చేసింది. ఈ ప్రయాణంలో భాగంగా 73 లీటర్ల ఇంధనంతో 1865.07 కిలోమీటర్ల దూరాన్ని కారు ప్రయాణించింది. అంటే లీటరుకు 26.87 కి.మీ మైలేజీతో కారు దూసుకుపోయినట్టు! వాస్తవానికి అధికారికంగా ఈ కారు ఇచ్చే మైలేజి లీటరుకు 23.72 కి.మీ మాత్రమే. పాత గణాంకాలను అధిగమించిన కారులో ఆటో ఇండస్ట్రీ జర్నలిస్టు ఆండ్ర్యూ ఫ్రాంకెల్, రేసింగ్ డ్రైవర్ రెబెక్కా జాక్సన్ లు ప్రయాణించారు. నెదర్లాండ్స్ లో ప్రారంభమైన ఈ యాత్ర 28 గంటల పాటు నాన్ స్టాప్ గా సాగి హంగేరీలో ముగిసింది. మార్గమధ్యంలో బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లీచెన్ స్టియన్, ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ, సాల్వేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా దేశాలను దాటింది. సరాసరిన గంటకు 80.46 కి.మీ వేగంతో కారును నడిపించామని, మార్గమధ్యంలో యాక్సిడెంట్ కారణంగా ఆలస్యం, మూసేసిన టన్నెల్ లేకుంటే మరింత మైలేజీని చూపేవారమని ఆండ్ర్యూ వ్యాఖ్యానించారు.