: చంద్రబాబు రాజీనామా చేస్తే... ఏపీ సీఎంగా అశోక్ గజపతిరాజు?
ఓటుకు నోటు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంలో, జాతీయ స్థాయి నేత అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియో టేపులు బయటకు రావడంతో, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై 'ముంబై మిర్రర్' ఆన్ లైన్ పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ కేసులో చంద్రబాబు పేరును చేర్చేందుకు అనుబంధ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసే యోచనలో తెలంగాణ ఏసీబీ ఉందని... దీనికోసం, కోర్టు అనుమతి తీసుకోనుందని తెలిపింది. ఒకవేళ, తన పేరును ఎఫ్ఐఆర్ లో చేరిస్తే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని... తాత్కాలిక ముఖ్యమంత్రిగా తనకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును నియమించనున్నారని పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని ప్రచురించింది. మరోవైపు, సీఎం పదవిని చేపట్టే వారి జాబితాలో నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కె.నారాయణల పేర్లు చక్కర్లు కొడుతున్నప్పటికీ... పాలనా దక్షత విషయంలో అందరికంటే అశోక్ గజపతిరాజే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారంటూ ముంబై మిర్రర్ ఊహాగానాలు చేసింది.