: ఇంటి అద్దె చెల్లించడం లేదని కన్నడ యువ నటుడికి కోర్టు నోటీసులు
కన్నడ యువ నటుడు యశ్ ఇంటి అద్దె వివాదంలో చిక్కుకున్నారు. నాలుగు సంవత్సరాలుగా అతను తన ఇంట్లో ఉంటూ అద్దె ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఇంటి యజమాని డాక్టర్ మునిప్రసాద్ బెంగళూరు స్థానిక కోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం నటుడికి నోటీసులు పంపింది. వచ్చే శనివారం నాడు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... కత్రిగుప్పెలో మునిప్రసాద్ కు ఉన్న ఇంటి కొంత భాగంలో నటుడు యశ్ తన తల్లిదండ్రులతో కలసి అద్దెకు ఉంటున్నాడు. 2013 నుంచి అద్దె ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఇల్లు కూడా ఖాళీ చేయడంలేదని యజమాని కోర్టులో పిటిషన్ వేశారు. ఇంతవరకు రూ.21.37 లక్షల అద్దె ఇవ్వాల్సి ఉందని తెలిపాడు. ఈ క్రమంలోనే కోర్టు నటుడుకి నోటీసు ఇచ్చింది. కానీ ఈ విషయాలను యశ్, అతని కుటుంబం ఖండిస్తోంది. అద్దె ఇవ్వని మాట నిజమేననీ, కానీ ఇంటి యజమాని కన్నడిగులను అవమానించారని, వేరే భాషలో తమను తిడుతున్నారని వివరించారు. అందుకే తాము అద్దె చెల్లించడం లేదని, ఇప్పటికీ అద్దె ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. తీసుకోవడానికే యజమాని మునిప్రసాద్ నిరాకరిస్తున్నాడని అంటున్నారు.