: ముదిరిన ‘ట్రాన్స్ కో’ వివాదం....ఉద్యోగుల పునర్నియామకానికి టీ సర్కారు ససేమిరా


రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య ప్రతి చిన్న అంశం పెను వివాదంగానే పరిణమిస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి, నీటి వాటాలు, విద్యుదుత్పత్తి, హైదరాబాదులో అధికారాలు తదితర అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలుగా మారాయి. తాజాగా ట్రాన్స్ కో ఉద్యోగుల బదలాయింపు ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసింది. ఆంధ్రా మూలాలున్న 1,400 మంది ఉద్యోగులను తెలంగాణ సర్కారు ఉన్నపళంగా ఏపీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాక వారిని క్షణాల్లో విధుల నుంచి రిలీవ్ చేసింది. అయితే వారంతా ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనిపై ఉద్యోగుల వాదన సరైనదేనని హైకోర్టు కూడా అభిప్రాయపడింది. ఉద్యోగుల బదలాయింపు చెల్లదని తేల్చిచెప్పింది. తక్షణమే ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ సర్కారుకు సూచించింది. అయితే తెలంగాణ సర్కారు హైకోర్టు సూచనను పెడచెవిన పెట్టింది. తాను రిలీవ్ చేసిన ఉద్యోగులను తిరిగి వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అవసరమైతే సుప్రీంకోర్టు గడప తొక్కడానికి కూడా సిద్ధమని ప్రకటించిన టీ సర్కారు, ఈ అంశంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించింది. నిన్న జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కు కూడా వెల్లడించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News