: అమెరికా తీరంలో సొరచేపల స్వైరవిహారం... టీనేజర్లకు తీవ్ర గాయాలు
అమెరికా తీరంలో సొరచేపలు (షార్కులు) స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా, ఉత్తర కరోలినాలోని ఓక్ ఐలాండ్ సముద్ర తీరంలో జలకాలాటల్లో మునిగిపోయిన టీనేజర్లపై సొరలు విరుచుకుపడ్డాయి. సముద్రజలాలను ఎరుపెక్కించాయి. ఓ కుటుంబానికి చెందిన పదహారేళ్ల బాలుడు, పద్నాలుగేళ్ల బాలిక సొర చేపల బారినపడ్డారు. ఘటనలో బాలిక చెయ్యి, కాలు సొరచేపలకు ఆహారంగా మారిపోగా, బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఇటీవలకాలంలో అమెరికా తీరంలో సొరచేపల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో, తీర ప్రాంతాల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణంగా ఓక్ లాండ్ దీవి చాలా సురక్షితమైన ప్రదేశమని, కానీ, సొరల రాకతో ప్రమాదకరంగా తయారైందని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.