: రేస్ తరువాత 'రేస్'... ఫినిష్ లైన్ తాకి తండ్రి చేతుల్లో కుప్పకూలిన టీనేజర్


ఆ అథ్లెట్ పేరు శామ్ పీటర్ మాన్. వయసు పదిహేనేళ్లు. న్యూయార్క్ లోని స్వీట్ హోం హైస్కూల్ లో చదువుతోంది. న్యూయార్క్ హైస్కూల్ స్టేట్ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా, 1500 మీటర్ల పరుగు పందెంలో బరిలోకి దిగింది. పోటీ ప్రారంభమైంది. కాళ్లు వేగంగా కదిలాయి. ఫినిష్ లైన్ వద్ద ఆ బాలిక తండ్రి డేల్ మీటర్ మాన్ ఎదురుచూస్తున్నాడు. మిగతావారిని దాటుతూ శామ్ శరవేగంగా దూసుకువచ్చింది. ఆ తరవాత ఏం జరగబోతుందో డేల్ కు తెలుసు. అందుకే సిద్ధంగా ఉండి రెండు చేతులూ చాచాడు. నోటితో గస, ఆయాసం, తల నిలపలేని పరిస్థితిలో "నాకు ఊపిరి రావడం లేదు" అని అరుస్తూ, వచ్చి తండ్రి చేతుల్లో వాలిపోయింది. ఆ వెంటనే పక్కనున్న గడ్డిపై పడుకోబెట్టి "ఏం ఫర్వాలేదు" అని చెబుతూ, మంచి నీరిస్తే, దాన్ని తాగి "నాకు మెడల్ వస్తుందా?" అని శామ్ అడిగింది. ఆ తండ్రి "అవును" అని సమాధానం ఇస్తే, తృప్తిగా నవ్విందా 'న్యూరో కార్డియోజీనిక్ సింకోప్' అనే వ్యాధితో బాధపడుతున్న శామ్. ఈ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా పరిగెడితే, నరాల వ్యవస్థ అదుపు తప్పుతుంది. ఏమాత్రం అటూ ఇటైనా ప్రాణం పోతుంది. అయినప్పటికీ, ఆ బాలిక ప్రతి పోటీలోనూ పాల్గొని సత్తా చాటుతూనే ఉంది. ఈ పోటీల్లో 6వ స్థానంలో నిలిచిన శామ్, తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరచుకోవడమే కాకుండా, స్కూలు రికార్డుకు దగ్గరగా వచ్చిందట. అంతకుముందు కూడా పలు రేస్ లలో పాల్గొన్న శామ్ కు ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. తన కూతురు పరుగుపందెం ముగించిన తరువాత ఆమెను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు తనో 'రేస్' మొదలు పెడతానని డేట్ నవ్వుతూ చెబుతుంటాడు.

  • Loading...

More Telugu News