: ఆ ఇంటిని ఇక అణుబాంబులు, భూకంపాలు, సునామీలు ఏమీ చేయలేవట!
అణుబాంబులు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు ఇకపై ఆ ఇళ్లను ఏమీ చేయలేవు. అలాంటి చెక్కుచెదరని అద్భుతమైన ఇళ్లను జర్మనీలో నిర్మించేందుకు కాలిఫోర్నియాకు చెందిన వివోస్ కంపెనీ సిద్ధమవుతోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రాబర్ట్ విసినో తెలిపారు. జర్మనీలోని రోతెన్ స్టీన్ గ్రామంలో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్ నిర్మించిన అండర్ గ్రౌండ్ టన్నెళ్లను 76 ఎకరాల్లో విస్తరించి ఈ నిర్మాణాలు సాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. 'డూమ్స్ డే ఎస్కేప్' పేరిట నిర్మించే ఈ ఇళ్లలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఒక్కో ఫ్లాట్ 2500 చదరపు అడుగులు ఉంటుందని, వ్యక్తుల అభిరుచులను బట్టి లోపలి మార్పులు ఉంటాయని ఆయన చెప్పారు. 67 వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో ఒక్కో ఇంటి ధర మాత్రం ఆయన వెల్లడించలేదు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, వాటర్ రీ సైక్లింగ్ యూనిట్, ఇంటి ఉపరితలంపై చిన్న హెలీకాప్టర్ పార్కింగ్ స్థలం వంటి సౌకర్యాలన్నీ ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి ఇళ్లు నిర్మించాలన్న ఆలోచన 1980లో తనకు వచ్చిందని, ప్రళయం ఎప్పుడెలా ముంచుకొస్తుందో తెలియని ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఇళ్లు ఎంతైనా అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.