: కస్టడీలో అన్నీ చెప్పేశాం, ఇక విచారించడానికి ఏమీ లేదు... హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
టీటీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ తో పాటు కేసు విచారణను ఎదుర్కొంటున్న సెబాస్టియన్, ఉదయ్ సింహలు కూడా బెయిల్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా, రాజకీయ కుట్రలో భాగంగానే తనను అన్యాయంగా కేసులో ఇరికించారని బెయిల్ పిటిషన్ లో రేవంత్ పేర్కొన్నారు. 4 రోజుల ఏసీబీ అధికారుల కస్టడీలో అన్ని విషయాలు చెప్పామని... ఇక విచారించడానకి ఏమీ లేదని... దర్యాప్తు పూర్తయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధిగా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును రేవంత్ కోరారు. విచారణ అధికారులకు సహకరిస్తానని, దర్యాప్తుకు ఆటంకం కలిగించనని పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు, రాజకీయవేత్త అయిన రేవంత్ కు బెయిల్ ఇవ్వరాదంటూ ఏసీబీ కౌంటర్ దాఖలు చేయనుంది. బెయిల్ పై రేవంత్ విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది.