: అడిగితే అండర్ వరల్డ్ డాన్ కూ సాయం చేసేస్తారా?... మోదీ సర్కారును నిలదీసిన కాంగ్రెస్!
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వీసాకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన సిఫారసుపై కాంగ్రెస్ తన మాటల దాడిని కొనసాగిస్తోంది. మోదీ వీసాకు సుష్మా సిఫారసుపై నిన్న ఘాటుగా స్పందించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, విదేశాంగ మంత్రి రాజీనామాను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా మరింత ఘాటుగా స్పందించారు. అడిగితే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా సాయం చేస్తారా? అంటూ నరేంద్ర మోదీ సర్కారుపై సుజ్రీవాలా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవలే గుజరాత్ లో వెలుగు చూసిన రూ.1,000 కోట్ల అక్రమ బెట్టింగ్ రాకెట్ ను ప్రస్తావించిన సుజ్రీవాలా, లలిత్ మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోనే కాక పలువురు బీజేపీ నేతలతో కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు. మానవతా దృక్పథంతోనే లలిత్ కు సాయం చేశామన్న ప్రభుత్వ వాదనను ఆయన తప్పుబట్టారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు బీజేపీ నేతలు సహకరిస్తున్నట్లుగా ఉందని సుజ్రీవాలా దుయ్యబట్టారు.