: నా మిత్రుడు రజనీకాంత్ చెప్పాడనే 'పెదరాయుడు' సినిమా నిర్మించా: మోహన్ బాబు

తెలుగునాట సంచలన విజయం సాధించిన చిత్రం 'పెదరాయుడు' విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్లు. 1995 జూన్ 15న ఈ చిత్రం విడుదలై ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయగా, సూపర్ స్టార్ రజనీకాంత్ పెదరాయుడి తండ్రి పాపారాయుడిగా నట విశ్వరూపం చూపించారు. భానుప్రియ, సౌందర్యలు కథానాయికల పాత్రల్లో జీవించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ పెదరాయుడుకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. 1994లో విడుదలైన తమిళ చిత్రం 'నట్టమై'ను తెలుగులో 'పెదరాయుడు'గా రీమేక్ చేశామని చెప్పారు. ఒక రోజు తన మిత్రుడు రజనీకాంత్ ఫోన్ చేసి, 'నట్టమై' సినిమా బాగా ఆడుతోంది, చూడమని చెప్పారని తెలిపారు. సినిమా చూసి 'బాగుందిరా' అని అన్నానని చెప్పారు. ఆ తర్వాత సినిమా రైట్స్ తీసుకోమని సూచించారని... పాపారాయుడు క్యారెక్టర్ తానే చేస్తానని చెప్పారని మోహన్ బాబు తెలిపారు. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా తన మిత్రుడు రజనీ ఈ సినిమాలో నటించారని... పైగా, షూటింగ్ కోసం తాను అడక్కపోయినా డబ్బిచ్చారని మోహన్ బాబు తెలిపారు. ఆ తర్వాత వేరే రూపంలో తానిచ్చిందేదో రజనీ స్వీకరించారని చెప్పారు. అలాంటి మిత్రుడు తనకుండటం తన అదృష్టమని రజనీని కొనియాడారు. పెదరాయుడు విడుదలై అప్పుడే 20 ఏళ్లు గడచిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అప్పట్లో 200 రోజుల విజయోత్సవ పండుగను దివంగత ఎన్టీఆర్ సమక్షంలో నిర్వహించామని చెప్పారు.