: సూసైడ్ బాంబర్ గా మారి తనను తాను పేల్చేసుకున్న అతి పిన్న వయస్కుడు!
అతని పేరు తల్హా అస్మాల్. వయసు కేవలం 17 సంవత్సరాలు. ఐఎస్ఐఎస్ పై మక్కువతో బ్రిటన్ నుంచి వెళ్లి సూసైడ్ బాంబర్ గా మారి తనను తాను పేల్చేసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాదులు పెట్టిన పోస్టులను పరిశీలించిన బ్రిటన్ అధికారులు ఆత్మహత్యా దళంలో చేరి హతమైన అతి పిన్న వయస్కుడు ఇతడేనని నిర్థారించారు. ఇరాక్ లోని దక్షిణ బైజీ సమీపంలో ఉన్న ఆయిల్ రిఫైనరీపై దాడి చేసిన నలుగురు సూసైడ్ బాంబర్లలో ఇతను కూడా ఉన్నాడని తెలిపారు. అతని కుటుంబం పాకిస్థాన్ నుంచి వచ్చి బ్రిటన్ లో స్థిరపడినట్టు తెలుస్తోంది. కాగా, 2005 జూలై 7న లండన్ బస్సులో తనను తాను పేల్చేసుకున్న 19 ఏళ్ల హసీబ్ హుస్సేన్ తరువాత అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలు సైతం ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవుతుండడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు అంటున్నారు.