: అమితాబ్ బచ్చన్ తండ్రి ధర్మేంద్ర, తల్లి హేమమాలిని... రేషన్ కార్డు మంజూరు
అన్ని రకాల వివాదాలకు, వింతలకు, అరాచకాలకు నిలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. తాజాగా ఈ రాష్ట్రంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్లు అయిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర తదితరుల పేర్లతో రేషన్ కార్డులను మంజూరు చేశారు. అంతేకాకుండా, సినిమాల్లోని ప్రాతల పేర్లు అయిన గబ్బర్ సింగ్, బసంతి తదితర పేర్లతో కూడా కార్డులు మంజూరయ్యాయి. ఈ ఘటన మొరాదాబాద్ జిల్లాలోని నరేంద్రపూర్ గ్రామంలో జరిగింది. అమితాబ్ పేరిట జారీ అయిన రేషన్ కార్డులో ఆయన తండ్రి స్థానంలో ధర్మేంద్రను, తల్లి స్థానంలో హేమమాలినిని పేర్కొన్నారు. అలాగే, గబ్బర్ సింగ్ రేషన్ కార్డులో ఆయన తండ్రి స్థానంలో కాలియా, తల్లి స్థానంలో బసంతి పేర్లను పెట్టారు. మరో దారుణం ఏమిటంటే... ఈ కార్డుల ద్వారా రేషన్ కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ రేషన్ కార్డులు ఎన్నో మంజూరయ్యాయి. ఈ రేషన్ కార్డుల స్కాంకు సంబంధించి, అనేక ఫిర్యాదులు అందడంతో... అధికారులు రంగంలోకి దిగారు. బోగస్ రేషన్ కార్డులను సృష్టించిన సదరు డీలర్ లైసెన్స్ ను రద్దుచేసేందుకు సిద్ధమయ్యారు.