: 'హలో ఎర్త్' అంటూ నిద్రలేచిన 'ఫిలే'


67పీ తోకచుక్కపై పరిశోధనలు చేస్తూ, సూర్యకాంతి లేక నెలల తరబడి నిద్రావస్థలో ఉండిపోయిన 'ఫిలే' తిరిగి నిద్రలేచింది. "హలో ఎర్త్! కెన్ యూ హియర్ మీ?" అంటూ ట్వీట్ పంపిందని, సుమారు 2 నిమిషాల పాటు సిగ్నల్స్ అందాయని, 40 సెకన్ల పాటు డేటాను పంపిందని యూరోపియన్ స్పేస్ ఏజన్సీ నేతృత్వంలోని నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్డడీస్ అధ్యక్షుడు జీన్ లీ గాల్ తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు 67పీ చుట్టూ తిరుగుతున్న 'ఫిలే' మదర్ షిప్ 'రోసెట్టా' సాయంతో 'ఫిలే'కు తాజా సంకేతాలు పంపి, తిరిగి పరిశోధనలు సాగించనున్నట్టు తెలిపారు. తోకచుక్కల రహస్యాలను, వాటిపై ఉండే ధూళి కణాలను, రాతి నిర్మాణాలను పరీక్షించడం ద్వారా సౌర వ్యవస్థ పుట్టుక రహస్యాలు తెలుసుకోవాలన్నది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. గత సంవత్సరం నవంబర్ 12న సుమారు 100 కిలోల బరువున్న రోబో 'ఫిలే' తోకచుక్కపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వెడుతుండడంతో ఫిలే బ్యాటరీలు వేగంగా చార్జింగ్ అవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఈ తోకచుక్క సెకనుకు 31.24 కి.మీ వేగంతో పరిభ్రమిస్తూ, సూర్యుడికి 30.5 కోట్ల కి.మీ, భూమికి 21.5 కోట్ల కి.మీ దూరంలో ఉంది.

  • Loading...

More Telugu News