: విద్యుత్ విమానాలు, శబ్దం చెయ్యని హెలికాప్టర్... కొలువుదీరిన లోహ విహంగాలు
ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన రంగ ప్రదర్శన పారిస్ ఎయిర్ షో-2015 ఈ ఉదయం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే ప్రారంభించారు. ఎయిర్ బస్, బోయింగ్ ల నుంచి 47 దేశాలకు చెందిన 2,260 కంపెనీలు తమ ఉత్పత్తులను, సాంకేతికతను అమ్మకానికి ఉంచాయి. సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు ప్రదర్శనను తిలకిస్తారని అంచనా. ఈ దఫా ఎగ్జిబిషన్ లో ఎయిర్ బస్ తీసుకువచ్చిన పలు కొత్త తరం విమానాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. పూర్తిగా విద్యుత్ ఆధారంగా నడిచే విమానం, అతి తక్కువ శబ్దం చేసే పౌర హెలికాప్టర్ తదితరాలను ఎయిర్ బస్ పరిచయం చేసింది. పర్యావరణానికి హాని కలిగించని ప్రొడక్టులకు మరింత ప్రాచుర్యం కల్పించే ఆలోచనలో భాగంగా వీటిని అభివృద్ధి చేశామని, 2020 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించేందుకు కట్టుబడి వున్నామని సంస్థ తెలిపింది. ఇక బోయింగ్ సంస్థ 20 శాతం ఇంధనాన్ని ఆదా చేసే 737 మ్యాక్స్ ను తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. వచ్చే సంవత్సరంలో వాణిజ్య అమ్మకాలు ప్రారంభమయ్యే ఈ మోడల్ కోసం ఇప్పటికే 2,700 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయి. వీటితో పాటు కెనడాకు చెందిన బొంబార్డియర్ సంస్థ తన సీ-సిరీస్ లో కొత్త విమానాలు తెచ్చింది. శుక్రవారం నుంచి సాధారణ ప్రజలు ప్రదర్శన తిలకించేందుకు అనుమతించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.