: ‘ఒక దేశం ఒకే నెంబరు’కు బీఎస్ఎన్ఎల్ శ్రీకారం...నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సేవలు
‘ఒక దేశం... ఒకే నెంబరు’.. ఇది ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ లక్ష్యం. ఈ కలకు ఆ సంస్థ నేటి నుంచి వాస్తవరూపం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా బీఎస్ఎస్ఎల్ ఉచిత రోమింగ్ సేవలు నేటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా సేవలను దేశంలో ప్రారంభిస్తున్న తొలి సంస్థగా బీఎస్ఎన్ఎల్ ఆవిర్భవించనుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు నేటి నుంచి ఎలాంటి చార్జీలు లేకుండానే దేశంలోని ఎక్కడి నుంచైనా ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ ను అందుకోవచ్చు. అంతేకాక ఇతర రాష్ట్రాలకు వెళితే, సిమ్ కార్డులను మార్చాల్సిన అవసరం కూడా రాదు. ఈ సేవల ప్రారంభాన్ని పురస్కరించుకుని నిన్న ఆ సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఇక నుంచి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు రెండు, మూడు సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి చార్జీలు, దిగులు లేకుండానే ఇన్ కమింగ్ ఫోన్ కాల్స్ ను ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఒక దేశం... ఓకే నెంబరు బీఎస్ఎన్ఎల్ కల. అది నిజమవ్వబోతోంది’’ అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.