: నేటితో ముగుస్తున్న రేవంత్ జ్యూడిషియల్ కస్టడి... బెయిల్ ఇవ్వరాదంటూ ఏసీబీ పిటీషన్!
ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో పూర్తి కానుంది. అయితే కస్టడీ గడువును పెంచాలని ఏసీబీ అధికారులు నేడు కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు సహనిందితులు సెబాస్టియన్, ఉదయ సింహల వాయిస్ లను నిర్ధారించుకునేందుకు వారి సెల్ ఫోన్లు, ఆడియో టేపులను ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన రిపోర్టులు ఏసీబీకి ఇంకా అందలేదు. ఈ నేపథ్యంలో నిందితుల జ్యుడిషియల్ కస్టడీని మరిన్ని రోజులు పొడిగించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరనున్నారు. రేవంత్ సహా ఇతర నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయరాదని కూడా సదరు పిటీషన్ లో వారు కోర్టును అభ్యర్థించనున్నారు.