: అమేథీ పర్యటనలో రాహుల్ పెళ్లి ప్రస్తావన!
దేశ ప్రధాని పీఠం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి వ్యవహారం, ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది. మన యువరాజుకి వాళ్ళింట్లో పెళ్లి పోరు ఎలా వుందో మనకు తెలియదు కానీ, ప్రజల నుంచి మాత్రం పెళ్లి పోరు ఎక్కువగానే వుంది. ఇందుకు ఉత్తరప్రదేశ్ లోని ఆమేథీలో శనివారం చోటు చేసుకున్న ఓ సంఘటనే నిదర్శనం. అమేథీ పార్లమెంటు సభ్యుడైన రాహుల్ నిన్న తన నియోజక వర్గంలో పర్యటించారు.
ఈ సందర్భంగా నగరంలోని చౌకీ మార్కెట్ మీదుగా ఆయన ఊరేగింపు వెళుతోంది. అదే సమయంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి దేవీప్రసాద్ కౌశీథాన్ తన షాపు వద్ద ఆయనకు తారసపడ్డాడు. ఇందిరాగాంధీ కుటుంబానికి పరిచయస్తుడైన కౌశీథాన్ ను రాహుల్ పలకరించి, అతని వ్యాపారం గురించి అడిగారు.
అంతా బాగానే వుందని చెప్పి, 'మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలన్నదే మా అందరి కోరిక. మరి పెళ్ళెప్పుడు?' అంటూ ఆయన అడగడంతో, మన యువరాజు గారు చిర్నవ్వు నవ్వి, 'త్వరలోనే' అంటూ సమాధానం ఇచ్చారు. మరి ఇక, ఆ త్వరలో రాహుల్ ని పెళ్లి కొడుకుగా చూస్తామేమో చూడాలి!