: గవర్నర్ గారూ! సెక్షన్ 8 మీకు అర్థం కావట్లేదా?: నరసింహన్ పై సోమిరెడ్డి ఫైర్
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైఖరిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా గవర్నర్ తీరును సోమిరెడ్డి తప్పుబట్టారు. రాష్ట్ర పునర్విభజన చట్టాలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ సర్కారు తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలపై కోర్టు మొట్టికాయలు వేస్తున్న వైనం గవర్నర్ కు కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సీమాంధ్రుల హక్కులకు భంగం కలుగుతుంటే, గవర్నర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 ద్వారా తనకు సంక్రమించిన విశేషాధికారాలను వినియోగించడంలో గవర్నర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తరగతి విద్యార్థికి సైతం విపులంగా అర్థమయ్యే సెక్షన్ 8 విధివిధానాలు అర్థం కావడం లేదా? అని ఆయన గవర్నర్ ను నిలదీశారు. గవర్నర్ పై తమకేమీ ద్వేషం లేదన్న సోమిరెడ్డి, బాధ్యత మరచి చేతులు కట్టుకుని కూర్చున్న గవర్నర్ వైఖరిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.