: ఈ వారంలోనే చంద్రబాబుకు నోటీసులు?... ముమ్మర సన్నాహాల్లో తెలంగాణ ఏసీబీ


ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఈ వారంలో నోటీసులు జారీ చేసేందుకు తెలంగాణ ఏసీబీ సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాక ఈ కేసు ఈ వారంలో కీలక మలుపు తిరగనుందని దర్యాప్తులో కీలక భూమిక పోషిస్తున్న ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కేసులో ప్రత్యక్ష సాక్షి, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్మి రేపో, ఎల్లుండో నమోదు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతేకాక ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన ఆడియో, వీడియో టేపుల నిర్ధారణకు సంబంధించిన నివేదిక కూడా రేపు ఏసీబీకి అందనుంది. ఈ నివేదిక రాగానే అనుబంధ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన ఏసీబీ అధికారులు, నివేదిక కోసం వేచి చూస్తున్నారట. ఇక నోటీసులపై ఎలా స్పందించాలన్న విషయంపై చంద్రబాబు కూడా పలు వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ ఏసీబీ నోటీసులు జారీ చేస్తే, వాటిని చంద్రబాబు కోర్టులో సవాల్ చేసే అవకాశాలూ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News