: మంత్రి ఈటెల హైదరాబాద్ తరలింపు... ప్రమాదం లేదన్న కరీంనగర్ వైద్యులు
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో రోడ్డు ప్రమాదానికి గురైన తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీరికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు, ఈటెల ఆరోగ్య పరిస్థితిపై కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ఆయనకు అన్ని రకాల టెస్టులు చేశామని, ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఇక, మంత్రితో పాటు గాయాలపాలైన అంగరక్షకులకు కూడా ప్రాణాపాయం లేదని చెప్పారు. కాగా, ఓ టిప్పర్ ను ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈటెల ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడినట్టు తెలిసింది. మంత్రి ఉపయోగిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా ఓసారి ఈ వాహనం ప్రమాదానికి గురయిందట. తాజా ప్రమాదం నేపథ్యంలో, ఆర్థిక మంత్రికి ఇలాంటి వాహనం ఏంటన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.