: 'బ్రాండ్ తెలంగాణ' వెంట ఆంధ్రా కార్పొరేట్ల పరుగులు!
సీన్ మారింది. ప్రత్యేక తెలంగాణ వస్తే పరిశ్రమలు తరలిపోతాయని జరిగిన ప్రచారం అవాస్తవంగా మిగలనుంది. ఆంధ్రాకు చెందిన టాప్ కార్పొరేట్ లీడర్లు 'తెలంగాణ బ్రాండ్'ను ముఖ్యంగా హైదరాబాదును వదిలేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సందర్భంగా, అక్కడ ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తల్లో అత్యధికులు ఆంధ్రావారే కావడం గమనార్హం. వీరిలో అత్యధికులు ముందు వరుసలో కూర్చోవడం విశేషం. ఈ సందర్భంగా పలువురు ఆంధ్రా వ్యాపార దిగ్గజాలు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. "అసాధ్యమైన దాన్ని మీరు సుసాధ్యం చేశారు" అని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి మల్లికార్జునరావు పొగిడారు. ఈ సమావేశానికి జీవీకే గ్రూప్ చైర్మన్ జీవీ కృష్ణా రెడ్డి, ల్యాంకో గ్రూప్ చైర్మన్ ఎల్ మధుసూధన రావు, డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ జీవీ ప్రసాద్, శ్రీసిటీ సెజ్ చైర్మన్, శ్రీని రాజు, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి, సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) వ్యవస్థాపకుడు, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తదితరులు కేసీఆర్, జీఎం రావుతో కలసి వేదికను పంచుకున్నారు. వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాదు. అందరూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ వేదికగా పరిశ్రమలు స్థాపించి వెలుగులోకి వచ్చినవారే. వీరితో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న రూయూ గ్రూప్ చైర్మన్ పవన్ రూయా, వాల్ మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్, మైక్రోమ్యాక్స్ ఎండీ రాజేష్ అగర్వాల్, బీహెచ్ఈఎల్ చైర్మన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.