: సోషల్ మీడియాలో మనమెక్కడంటే..!
సోషల్ మీడియా... సామాజిక మాధ్యమం... నలుగురితో మనల్ని కలిపే వేదిక. ఫేస్ బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్స్ యాప్ కావచ్చు... మాధ్యమం ఏదైనా సరే ఇండియన్ నెటిజన్లకు ఒకసారి నచ్చితే సదరు సేవలందిస్తున్న కంపెనీ నక్కను తొక్కి వచ్చినట్టే అనడంలో సందేహం లేదు. అన్ని సామాజిక మాధ్యమ కంపెనీలకూ భారత మార్కెట్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మన స్థానం ఎక్కడని ఒక్కసారి ప్రశ్నించుకుంటే... ఫేస్ బుక్ కు రెండవ అతిపెద్ద మార్కెట్ ఇండియా. ఫేస్ బుక్ అత్యధిక ఖాతాలు అమెరికాలో ఉన్నాయి. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే, అత్యంత వేగంగా భారత ఖాతాదారులను పెంచుకుంటూ వెడుతోంది. స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా యాప్ గా సేవలందిస్తున్న వాట్స్ యాప్ కు అతిపెద్ద మార్కెట్ భారతే. లింకెడ్ ఇన్ ను పరిశీలిస్తే, భారత్ రెండవ అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది. తాజాగా విడుదలైన 'ఫేస్ బుక్ లైట్' డౌన్ లోడ్ల సంఖ్య ఇండియాలో శరవేగంగా పెరుగుతోందట. ఇండియాలో ఫేస్ బుక్ ఖాతాలు 11.2 కోట్ల మందికి ఉంటే, మొబైల్ ఫేస్ బుక్ ఖాతాలు 9 కోట్ల మందికి ఉన్నాయట. వాట్స్ యాప్, యూ ట్యూబ్ లను 7 కోట్ల మంది వినియోగిస్తుంటే, లింకెడ్ ఇన్ కు 2.4 కోట్ల మంది, ట్విట్టర్ కు 2.2 కోట్ల మంది ఖాతాదారులున్నారట. అదీ సోషల్ మీడియాలో మన స్థానం!