: నిందితుడిగా కాకుండా సాక్షిగా బాబు... టీ-ఏసీబీ నిర్ణయం!
సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబును విచారించాలని భావిస్తున్న తెలంగాణ ఏసీబీ, ఐపీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తొలుత బాబును కూడా నిందితుడిగా చేర్చి సీఆర్ పీసీ 40 కింద నోటీసులు ఇవ్వాలని భావించినా, కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశముందని ఏసీబీ వర్గాలు అంటున్నాయి. దీంతో దర్యాప్తు నీరుగారుతుందని, సాక్షిగా పిలిస్తే నోటీసులను గౌరవించి తీరాల్సిన పరిస్థితి వస్తుందని ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో విట్నెస్ గా తనకు తెలిసిన సమాచారం ఇవ్వాలని, నోటీసులు పంపేందుకు ఏసీబీ సిద్ధమైందని తెలుస్తోంది. ఒకవేళ ఈ నోటీసును ఖాతరు చేయకుంటే, ఐపీసీ 174 కేసు కింద కేసు పెట్టే అవకాశాలు పరిశీలించవచ్చని ఆ అధికారి వివరించారు.