: స్టీఫెన్ వాంగ్మూలం తర్వాత మరిన్ని అరెస్టులు... పక్కాగా ప్లాన్ చేస్తున్న టీ ఏసీబీ!
ఓటుకు నోటు కేసులో రానున్న రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరగనున్నాయని విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి పోలీసు వర్గాల్లో ఈ విషయంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన సాక్షి స్టీఫెన్ సన్ జడ్జి ముందు ఇవ్వనున్న వాంగ్మూలం కీలకంగా మారనుందని తెలుస్తోంది. వాస్తవానికి నిన్ననే స్టీఫెన్ న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా, దానిని ఏసీబీ వాయిదా వేసింది. నేడో, రేపో ఆయనతో వాంగ్మూలం ఇప్పించేందుకు ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్టీఫెన్ వాంగ్మూలం ఆధారంగా ఎవరెవరిని అరెస్ట్ చేయాలన్న విషయంపై ఏసీబీ ఓ అంచనాకు రానుంది. వాంగ్మూలంలో స్టీఫెన్ సన్ ఎవరెవరి పేర్లు వెల్లడించనున్నారన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే స్టీఫెన్ నుంచి పక్కా సమాచారం సేకరించిన పోలీసులు పలువురి అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం స్టీఫెన్ తో జడ్జికి వాంగ్మూలం ఇప్పించిన తర్వాత అరెస్టుల పర్వానికి తెరతీస్తే, తమపైన ఆరోపణలు రాకుండా చూసుకోవాలన్న భావనలో ఏసీబీ బాసులున్నారు. ఇదిలా ఉంటే, మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాదు చేరుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను హైదరాబాదు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి నిన్న కలిశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో పెద్ద తలకాయలనే ఏసీబీ అరెస్ట్ చేయబోతోందన్న వాదన వినిపిస్తోంది.