: ప్రశంసిస్తారని ఫోటోలు పెడితే... సెటైర్లు వేస్తున్నారు!
సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం వెనుక ఓ కారణం ఉంటుంది. అలాగే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన నివాసంలో యోగా చేస్తున్న దృశ్యాల ఫోటోలను సామాజిక వెబ్ సైట్ ‘ట్విట్టర్’లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు మంచి ఆదరణ లభిస్తుందని భావించిన జవదేకర్ కు నిరాదరణ ఎదురైంది. అంతేకాదు, సోషల్ మీడియాలో నెటిజన్లు కేంద్ర మంత్రిని తమ తమ వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతున్నారు. మంత్రిగారి యోగా విధానం, భంగిమలు చూసిన నెటిజన్లు ‘ఏంటి... మంత్రిగారు యోగా చేయడానికి మ్యాట్ ఉపయోగించడం మర్చిపోయారా?'... 'మెత్తని గడ్డిపై పరుపు వేసుకుని భలే యోగా చేస్తున్నారే!'... 'అసలు మీకు యోగా వచ్చా? మీకు యోగా నేర్పిన గురువు ఎవరు? మీ టీనేజీ అమ్మాయి మీకు యోగా నేర్పలేదుకదా?’ అంటూ వెటకారం ప్రదర్శిస్తున్నారు. నెటిజన్ల స్పందన చూసిన కేంద్ర మంత్రి కంగుతిన్నారట!