: కుర్చీ వేసుకుని నువ్వు కూర్చుంటే, నీ బంగారు ముఖాన్ని టికెట్లు కొనుక్కుని చూస్తారా?: కేసీఆర్ కు బైరెడ్డి కౌంటర్


ఆర్డీఎస్ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఘాటుగా స్పందించారు. చేతులు ముడుచుకుని కూర్చోబోమని, రాయలసీమ పౌరుషం చూపిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ గురువారం ఓ సభలో మాట్లాడుతూ... "ఆర్డీఎస్ వద్దే కుర్చీ వేసుకుని కూర్చుంటా, నీ మూతిమీద తన్ని మరీ ప్రాజెక్టు కట్టిస్తా" అంటూ బైరెడ్డికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో బైరెడ్డిని ఉద్దేశించే 'కొడకా', 'బిడ్డా' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు బైరెడ్డి బదులిస్తూ... ఆ కొడుకు ఈ కొడుకు అనడం కాదని, చాతనైతే ఆ కర్ణాటక కొడుకులను అదుపులో పెట్టాలని హితవు పలికారు. కర్ణాటక జలచౌర్యాన్ని అడ్డుకునే ధైర్యం లేదుగానీ, తమపై మాత్రం ధ్వజమెత్తుతున్నారని మండిపడ్డారు. కుర్చీ వేసుకుని కూర్చోవాల్సింది ఎగువ తుంగ వద్ద, భద్ర వద్ద అని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ అక్రమ ప్రాజెక్టులు కట్టే చోట కుర్చీలు వేసుకుని కూర్చోవాలని సూచించారు. అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికొచ్చి కుర్చీ వేసుకుని కూర్చుంటానంటే కూర్చోండి, కానీ, తమకు మూతి మీద మీసం ఉందని, ప్రాజెక్టు కడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, రాయలసీమ పౌరుషం చూపిస్తామని హెచ్చరించారు. ఇక్కడా రైతులు ఉన్నారని అన్నారు. తమకు దేవుడు కరవుకాటకాలు ఇచ్చాడని, పేదరికాన్ని ఇచ్చాడని, అంతకంటే ఎక్కువగా పౌరుషాన్ని ఇచ్చాడని తెలిపారు. రాయలసీమ సంగతి అందరికీ తెలుసని, కేసీఆర్ కు ఇంకా బాగా తెలుసని వ్యంగ్యం ప్రదర్శించారు. నువ్వు కుర్చీ వేసుకుని కూర్చుంటే, సినిమా చూసినట్టు నీ బంగారు ముఖాన్ని టిక్కెట్లు కొనుక్కుని చూస్తారా? అని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం లేదని అన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని, సమయం వచ్చినప్పుడు తమ పౌరుషం చూపిస్తామని బైరెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News