: మా అమ్మని నిద్రలేపడంలో సాయం చేయరూ!: చిన్నారి ఆక్రందన


తల్లి మరణించిందన్న విషయం తెలియని చిన్నారి ఆక్రందనకు స్థానికులు, పోలీసుల మనసుల్లో ఆర్ద్రత నిండిపోయింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ లో కోర్ట్ ఏరియాలో లిడియా మెక్ డోనల్డ్ (28) అనే మహిళ మూడేళ్ల కుమారుడు మేసన్ మార్టిన్ తో జీవిస్తోంది. ఆమె భర్త బాబీ మార్టిన్ మూడేళ్ల క్రితమే మరణించాడు. దాంతో తన చిన్నారిని ప్రాణంగా చూసుకుంటూ ఆమె జీవిస్తోంది. శనివారం వారింట్లో చిన్న పార్టీ జరిగింది. అనంతరం బుధవారం ఆమెను చూసేందుకు బంధువులు వారింటికి వచ్చారు. ఆ సమయంలో, తన తల్లిని నిద్రలేపేందుకు ఎవరైనా హెల్ప్ చేయాలని మేసన్ మార్టిన్ పోస్టు బాక్స్ కంతలోచి అరవడం గుర్తించారు. దీంతో తలుపులు తీసేందుకు ప్రయత్నించారు. లోపల గడియపెట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు బద్దలుగొట్టి బాలుడ్ని రక్షించారు. ఆ ఇంట్లో బాలుడి తల్లి లిడియా మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. ఆమె ఆస్తమాతో రెండు రోజుల క్రితం మృతి చెంది ఉంటారని వారు భావిస్తున్నారు. రెండు రోజులుగా పిల్లాడు తల్లి నిద్రపోయిందని భావించి లేపుతున్నాడని అర్థం చేసుకున్నారు. కాగా, మేసన్ మార్టిన్ ను అమె చూసుకునే విధానం గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె అద్భుతమైన తల్లి అని అంతా కొనియాడుతున్నారు.

  • Loading...

More Telugu News