: ఇకపై రైల్వేలకు విడిగా బడ్జెట్ వద్దు!
రైల్వే బడ్జెట్ ను పార్లమెంటులో విడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలకాలన్న సిఫార్సులు కేంద్రానికి అందాయి. వివేక్ దేవరాయ్ అధ్యక్షతన రైల్వే వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఏర్పాటైన కమిటీ ఈ మేరకు తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. రైల్వేలను మరో ప్రభుత్వ రంగ సంస్థగానే చూడాలని, విడిగా బడ్జెట్ కేటాయించి, దాన్ని సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. ఎంతో కాలంగా రైల్వే బడ్జెట్ తొలగించాలని ఆర్థికవేత్తలు కోరుతున్నారని గుర్తు చేసిన కమిటీ, బ్రిటీష్ పాలనలో మొదలైన ఈ సంప్రదాయం ప్రస్తుత కాల పరిస్థితులకు అంతగా నప్పదని వివరించింది. దీంతో పాటు రైల్వేల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, ఆసుపత్రులు, స్టేడియాలు, నిర్మాణ రంగంలో జరుగుతున్న అభివృద్ధి, భద్రత తదితరాల నిర్వహణకు విడిగా సంస్థను ఏర్పాటు చేస్తే మరిన్ని లాభాలు నమోదు చేసే స్థితికి రైల్వే వ్యవస్థ చేరుతుందని కమిటీ అభిప్రాయపడింది. రైల్వేల్లో వాటాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కూడా సిఫార్సు చేసింది.