: సినిమాలైనా, టీవీ చానళ్లయినా, హై డెఫినిషన్లో ఆగకుండా చూపిస్తాం: ముఖేష్
4జి సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత సినిమాలైనా, టెలివిజన్ చానళ్లయినా హెచ్ డీ మోడ్ లో ఏ విధమైన అవాంతరాలు లేకుండా చూపిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వివరించారు. తొలిదశలో 8 భాషలకు చెందిన 17 న్యూస్ చానళ్లు, 14 వినోద చానళ్లు ప్రసారమవుతాయని, వీటిని తిలకించేందుకు రిలయన్స్ జియో ప్రత్యేక యాప్ లను అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. 10 లక్షలకు పైగా పాటలు, వేలాది సినిమాలను కస్టమర్ల కోసం స్టోర్ చేసి వుంచుతామని అన్నారు. ఇవి ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని ముఖేష్ వివరించారు. నాలుగో తరం రేడియో తరంగాలను ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు అందిస్తామని తెలిపారు. రిలయన్స్ జియో నుంచి విడుదలైన 'జియో మనీ డిజిటల్' యాప్ ను వినియోగించడం ద్వారా చిన్న చిన్న బార్బర్ షాపుల నుంచి కిరాణా స్టోర్లు, టాక్సీ డ్రైవర్ల వరకూ, తమ కస్టమర్ల నుంచి నగదు రహిత లావాదేవీలు జరుపుకోవచ్చని, చెల్లించాల్సిన మొత్తం, సులువైన విధానంలో డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి చేరిపోతుందని తెలిపారు. ఇందుకోసం ఆర్బీఐ నిబంధనల మేరకు ప్రభుత్వ రంగ ఎస్ బీఐతో పేమెంట్ గేట్ వే డీల్ కుదుర్చుకున్నామని, ఈ సేవలను పొందేందుకు ఏ విధమైన గాడ్జెట్లను కొనుగోలు చేసే అవసరం ఉండదని తెలియజేశారు. వారు వాడుకునే స్మార్ట్ ఫోన్ మాధ్యమంగా ఈ సేవలను అందిస్తామన్నారు.