: రూ. 4 వేల లోపే 4జి ఫోన్, 2జి ధరలో 4జి సేవలు... ఇండియాకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్


ఇండియాలో 2జి డేటా సేవల కోసం మొబైల్ కస్టమర్లు వెచ్చిస్తున్న మొత్తానికే 4జి సేవలను అందించడమే లక్ష్యంగా డిసెంబర్ నాటికి రిలయన్స్ జియో సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వివరించారు. అందరికీ అందుబాటు ధరలో రూ. 4 వేలకే 4జి ఫోన్లను పరిచయం చేయనున్నామని తెలిపారు. నేడు సంస్థ ఏజీఎంలో ప్రసంగించిన ఆయన, తొలి దశలో 80 శాతం భారతావని 4జి గొడుగు కిందకు వస్తుందని, వచ్చే మూడేళ్లలో 100 శాతం కవరేజ్ సాధిస్తామన్న నమ్మకముందని తెలిపారు. ఇందుకోసం 2.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ లైన్లు నిర్మించామని, డీప్ ఫైబర్ నెట్ వర్క్ దిశగా మరో రెండేళ్లలో మరిన్ని లైన్లు వేయనున్నామని తెలిపారు. ఇండియాలోని 50 నగరాల్లో 10 లక్షల గృహాలకు ప్రత్యక్ష ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వనున్నామని తెలిపారు. 18 వేల గ్రామాలు, టియర్ 2, 3 పట్టణాలకు 4జి సేవలను అందిస్తామని, ఈ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలకూ కనెక్టివిటీ ఇస్తామని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ జియో నుంచి 'జియో చాట్' పేరిట మొబైల్ యాప్ ను విడుదల చేయగా, ఏ విధమైన ప్రచారం చేయకుండానే 10 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకుని వాడుకుంటున్నారని తెలిపారు. 2016 ముగిసేలోగా 5 కోట్ల సెల్ ఫోన్ వాడకందారులకు 4జి సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News